కుప్పం, సామాజిక స్పందన:
కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1+3 విధానంలో 3వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే తాను 3వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..
అమ్మ క్యాంటీన్‌ను స్టాలిన్ కొనసాగిస్తున్నారు..
''నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై మీకెందుకంత కోపం? పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దాని నిర్వాహకునిపై దాడి చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్ కొనసాగిస్తున్నారు. హంద్రీనీవా పనుల్లో మరో రూ.50కోట్లు ఖర్చు చేసి ఉంటే నీళ్లు వచ్చేవి. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లిచ్చాను.
ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి ఎలా ?
ఈరోజు ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద వందల మంది పోలీసులను భద్రతగా పెట్టారు. అదే పోలీసులను అన్న క్యాంటీన్ దగ్గర ఎందుకు పెట్టలేదు? పోలీసులు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి అండగా ఉంటా. నేను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే నువ్వు బయట తిరిగేవాడివా? వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వదిలిపెట్టను. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి జరిగింది. ఆ పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలి'' అని చంద్రబాబు అన్నారు.
########### మరిన్ని వార్తలు #############
మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను, కామన్వెల్త్ బృందంతో మాట్లాడిన ప్రధాని
దిల్లీ, సామాజిక స్పందన:
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.61 పతకాలు దేశానికి అందించి.. భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన క్రీడా బృందం శనివారం ప్రధాని మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో వారితో ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను కొనియాడారు. అలాగే చెస్ ఒలింపియాడ్ నిర్వహణ గురించి ప్రస్తావించారు.
'మీ షెడ్యూల్‌లో వెసులుబాటు చేసుకొని నా కుటుంబసభ్యుల్లా మీరంతా నన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీతో మాట్లాడుతున్నందుకు.. మిగతా భారతీయుల వలే నేను చాలా గర్వపడుతున్నాను. మన దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ.. మీ కృషితో క్రీడల్లో దేశం రెండు విజయాలను నమోదు చేసింది. మొదటిసారి చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటుగా.. కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. చెస్ ఒలింపియాడ్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా.. ఆ ఈవెంట్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. దీనిలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికీ.. పతకాలు సాధించిన వారికి నా అభినందనలు'
'కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందు నేను మీకొక మాట చెప్పాను. మీరు తిరిగి వచ్చాక అంతా కలిసి విజయోత్సవం జరుపుకొందామన్నాను. మీరు విజయంతో తిరిగి వస్తారని నేను నమ్మాను. బిజీగా ఉన్నా.. మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నాను. క్రితంసారితో పోలిస్తే.. నాలుగు కొత్త క్రీడల్లో విజయానికి బాటలు వేశాం. లాన్ బౌల్స్ నుంచి అథ్లెటిక్స్ వరకూ అపూర్వ ప్రదర్శన చేశాం. యువత కొత్త క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ఈ విజయాలు దోహదం చేస్తాయి. ఈ దిశగా మన పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంది' అని మోదీ సూచించారు.
బర్మింగ్‌హామ్ వేదికగా ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఇందులో భారత్ 61 పతకాలు సాధించి.. నాలుగో స్థానంలో నిలిచింది. 22 బంగారు, 16 వెండి, 23 కాంస్య పతకాలను సాధించింది.











0 Comments